రెడ్లు, వెలమ కులాలు తెలంగాణకు ఒరిజినల్ కాదు: రౌండ్ టేబుల్ సమావేశంలో కంచె ఐలయ్య హాట్ కామెంట్స్

రెడ్లు, వెలమ  కులాలు తెలంగాణకు ఒరిజినల్ కాదు: రౌండ్ టేబుల్ సమావేశంలో కంచె ఐలయ్య హాట్ కామెంట్స్

హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో... తెలంగాణ కుల సర్వే, విద్యా వ్యవస్థపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా... మేధావులు, ప్రొఫెసర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ సమావేశంలో ముఖ్య వక్తగా పాల్గొన్న ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ... తెలంగాణ కుల సర్వేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే అసలు ఒక సర్వేనే కాదన్న ఆయన... తాజా కుల సర్వేలో జనాభా లెక్కలు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే సీఎం అవుతారని తాను ఎప్పుడో చెప్పానని... ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రెడ్లకే పూర్తి సపోర్ట్ ఇస్తోందని ఆరోపించారు. మరి బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (BC) లకు పదవులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. 

తెలంగాణలో రెడ్లు, వెలమలు ఒరిజినల్ కాదన్న ఐలయ్య... సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి చూపిస్తున్న ఉత్సాహం... గద్దర్, చాకలి ఐలమ్మ విగ్రహాల ఏర్పాటుపై ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. విద్యా కమిషన్ చైర్మన్ రాజీనామా చేయడాన్ని బట్టి చూస్తే... రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ప్రొఫెసర్ సింహాద్రి రూపొందించిన రిపోర్ట్‌ను అందరూ చదవాలని, గ్రామాల వారీగా కులాల స్టేటస్ రిపోర్ట్‌ను వివరించాలని కోరారు. అలాగే బీసీలు తమ స్వంత యూట్యూబ్ ఛానెళ్లు పెట్టుకుని, తమ భాషలో గళం విప్పాలని... ప్రస్తుతం V6 తో పాటు మరొక ఛానెల్ మాత్రమే తెలంగాణ సబ్బండ వర్గాల వార్తలను ప్రసారం చేస్తున్నాయని ఐలయ్య అన్నారు.

ప్రొఫెసర్ భంగ్య భూక్యా మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన సర్వేపై కుల సంఘాల్లో విస్తృత చర్చ జరగాలన్నారు. ప్రస్తుత కులాల లెక్కల్లో తేడాలు ఉన్నాయని... తాము డేటా అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. తాము మూడు అంశాలపై ఒక సెల్ఫ్ రిపోర్ట్ డేటాను సిద్ధం చేశామని... దీనిని ట్యాంపరింగ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల కుల సంఘాలకు ఉపాధి లభించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థ అంధకారంలో కూరుకుపోతోందని... విద్యా సంస్థలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాదిగలకు భూములు ఉన్నప్పటికీ... విద్యాపరంగా వారు ఇంకా వెనుకబడే ఉన్నారని భూక్యా గుర్తుచేశారు.

 ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ... తెలంగాణ దేశంలోనే 3వ సంపన్న రాష్ట్రంగా ఉన్నప్పటికీ... దానికి తగ్గ అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ఇంత పెద్ద రాష్ట్రంలో కనీసం టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌లను అసలు అమలు చేస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశ సంపదను ప్రధాని మోదీ... అదానీ, అంబానీల చేతుల్లో పెడుతున్నారని విశ్వేశ్వర్ రావు తీవ్రంగా విమర్శించారు.